Friday 19 March, 2010

ఏమో ? ఏమని అనాలో.. ?

నేను ఇది ఎందుకు వ్రాస్తున్నానో తెలుసుకోవడానికి ఇది వ్రాస్తున్నాను. అసలు ఏమన్నా రాయడానికి ముందునుంచే అనుకొన్న ఏమన్నా నిర్దేశం ఉండాలా? అంటే ఆ goal కి తగ్గటూగా ఒక ఆలోచనకు వేలాడుతూ ఆ చీకటి నూతిలోకి తొంగి చూసి భయం వేసినపుడు అదే ఆలోచనా తాడుతో పైకి వచ్చి మళ్ళీ పైకి క్రిందకు వస్తూ వెళ్తూ ఆయాసం వచ్చినప్పుడు ఆ వ్రాతకు అంతం పలుకుతారా? అస్సలు ఏ తాడు లేకుండా ఆ చీకటి నూతి లోకి దూకితే ఏమవుతుంది? మళ్ళీ పైకి రాగలమా?

నూతిలో లోలోపలికి వెళ్తుంటే వెలుతురు కనిపిస్తోంది. ఒక దశానిర్దేశం లేకుండా అలాగే వెళ్తున్నా.. ఇంత ప్రశాంతంగా పాతవన్నీ వదిలేసి వెళ్తూ ఉంటే ,ఈ అసంబద్ధ క్షణాన అడుగు తీసి ఇంకొక అడుగు ముందుకు ఎందుకు వేస్తున్నాను? ఇప్పుడు ఆగిపోవాలా? లేక నడుస్తూ ముందుకు వెళ్తే సమాధానం దొర్కుతుందా? అలాగే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నా.. ఇది ఒక ఆలోచనారహిత క్షణం అని గుర్తిస్తూనే ఆ క్షణం పోయింది. మళ్ళీ ఏమన్నా రాయలంటే ఇంకొక ఆలోచన.ఆలోచించకుండా ఏమీ చెయ్యలేమా? అస్సలు ఒక ఆలోచనకు మరో ఆలోచనకు మధ్య ఏం జరుగుతోందన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నా.. ఆలోచనారాహిత్యాన్ని మాటల్లో పెట్టలేమేమో అన్న ఆలోచన. మళ్ళీ శూన్యం . అదే చీకటి నుయ్యి మళ్ళీ వచ్చిందనుకుంట ..! ఎంత లోపలికి వెళ్తున్నా చీకటి గానే ఉంది. ..నా ఆలోచనలతో సతమతమవుతున్నా..

-పీపుదీపు